హార్సిలీలో హాయ్‌.. హాయ్‌..
వేసవిలో ప్రయాణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? ఆ జాబితాలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌ పేరు రాసేయండి. ఏసీ గదిలో దొరికే చల్లదనం ఇక్కడ లభిస్తుంది. వేసవి విడిదిగా పేరొందిన ఆ చల్లని కొండ విశేషాలు తెలుసుకుందాం.
అది 1865-67 ప్రాంతం.. డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్‌ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారినికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం.. చల్లదనం.. ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై ఒక బంగ్లాను నిర్మించారు. ఆ ప్రాంతాన్ని వేసవి విడిదిగా తీర్చిదిద్దారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్‌ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.
కావాల్సినంత వినోదం..
హార్సిలీ కొండపై పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలనూ, పెద్దలనూ అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉన్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్‌ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకూ దుప్పటి కప్పుకొని నిద్దురోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు.
ఎలా వెళ్లాలి?
హార్సిలీ హిల్స్‌ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన, ప్రైవేట్‌ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి.

News Credits – Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *